చైనా బరితెగింపు.. కశ్మీర్‌ లేకుండా చేసి.. | Sakshi
Sakshi News home page

చైనా బరితెగింపు.. కశ్మీర్‌ లేకుండా చేసి..

Published Thu, Jan 4 2018 4:23 PM

Chinese globes sold in Canada cut Kashmir  - Sakshi

కెనడా : నిత్యం భారత్‌తో పేచి పెట్టుకునే చైనా మరో దుర్మార్గపు చర్యకు పూనుకుంది. ఏకంగా కశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌తో సంబంధం లేదన్నట్లుగా చూపించే గ్లోబులను మార్కెట్‌లోకి విక్రయించింది. పెద్ద మొత్తంలో కెనడా దుకాణాల్లో దర్శనం ఇస్తున్న ఈ గ్లోబులు ఇప్పుడు భారత సంతతి అమెరికన్‌ పౌరులను తీవ్రంగా కలవర పెడుతున్నాయి. వాటిని చూసే తమ చిన్నారులకు భారత భౌగోళిక స్వరూపం ఎలా చూపించాలని ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నూతన సంవత్సరం సందర్భంగా సందీప్‌ దేశ్వాల్‌ అనే ఓ భారత సంతతి అమెరికన్‌ తన ఆరేళ్ల కూతురు అస్మితాకు గ్లోబు కొని తీసుకొచ్చాడు. క్రిస్మస్‌ సందర్భంగా శాంటా తాతకు తనకు గ్లోబ్‌ కావాలని అస్మిత విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తల్లిదండ్రులు ఆమె కోరికను తీర్చారు.

అయితే, ఆ గ్లోబులో భారత్‌ ఎక్కడ ఉంది? కెనడా ఎక్కడ ఉంది ? అని పాప అడిగినప్పుడు వారు ఒక్కసారిగా కలవరపడ్డారు. భారత్‌కు తలకాయలాంటి కశ్మీర్‌ను పూర్తిగా వేరు చేసి ఆ గ్లోబులో ఉంది. ఆ గ్లోబులన్నీ కూడా చైనా తయారు చేసినవే. దీంతో తాను ఈ విషయాన్ని గ్లోబులు విక్రయిస్తున్న దుకాణానికి తెలియజేశాడు. ఈ సందర్బంగా తన ఆందోళనను మీడియాతో పంచుకుంటూ 'కశ్మీర్‌ కూడా భారత్‌లో భాగమే అనే విషయాన్ని ఇప్పుడు తాను తన కూతురుకి చెప్పకుంటే తను మరో రూపంలో ఉన్న భారత్‌ చిత్రపటాన్ని ఊహించుకుంటుంది. ముందు తరాల వారు కూడా దానినే అనుసరించే ప్రమాదం ఉంది. చైనా చేసిన ఈ చర్యను ఏమాత్రం సహించకూడదు' అని ఆయన అన్నారు.

Advertisement
Advertisement